: ‘టాలెంట్’ను నిలుపుకోవడం కంపెనీలకు తలకు మించిన భారమే!


నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కలకాలం నిలుపుకుని పనిచేయించుకునేందుకు ఆయా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయట. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉన్నా, భారత్ లో మాత్రం కంపెనీల యజమానులు, దీనిని తలకుమించిన భారంగా పరిగణిస్తున్నారు. నైపుణ్యం సమృద్ధిగా ఉండటంతో పాటు సదరు కంపెనీలో అప్పటికే పనిచేస్తున్న క్రమంలో కార్యకలాపాలు సజావుగా సాగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇతర కంపెనీలు విసురుతున్న ఆశల వలకు తమ సిబ్బంది ఎక్కడ చిక్కుకుంటారోనన్న ఆందోళనలో మెజార్టీ కంపెనీలు నిత్యం భయంభయంగానే గడిపేస్తున్నాయని తాజాగా జరిగిన ఓ సర్వే వెల్లడించింది. నైపుణ్యం పుష్కలంగా ఉన్న టాప్, మిడిల్ మేనేజ్ మెంట్లలో పనిచేస్తున్న వారిని ఎగరేసుకునిపోయేందుకు ప్రత్యర్థి కంపెనీలతో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న కంపెనీలు భారీ నజరానాలనే ఆఫర్ చేస్తున్నాయి. వీటి వలయం నుంచి ఉద్యోగులను నిలుపుకునేందుకు ఆయా కంపెనీలు కూడా భారీగానే వేతనాలను పెంచాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయని ఏబీసీ కన్సల్టెంట్స్ యజమాని శివ్ అగర్వాల్ చెబుతున్నారు. నియామకాలే ప్రధానంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీని ఆశ్రయిస్తున్న కార్పొరేట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. ఇలా నిపుణులైన ఉద్యోగుల కోసం తమ వద్దకు వస్తున్న యజమానులు... ఉద్యోగులను నిలుపుకోవడం సాధ్యం కావడం లేదని వాపోతున్నారని అగర్వాల్ తెలిపారు. ఒక్కోసారి ఉద్యోగిని నిలుపుకునేందుకు... ఒకేసారి 90 శాతం వేతనాన్ని పెంచుతున్న యజమానులు కూడా ఉన్నారు. ఇతర కంపెనీ ఆఫర్ ను తమ ఉద్యోగి వదులుకునేందుకు ఆ మేరకు భారం మోయక తప్పలేదని ఈఎంఏ పార్టనర్స్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ సుదర్శన్ చెబుతున్నారు. ఈ ఏడాది ఈ తరహా కౌంటర్ల శాతం 15-20 శాతం దాకా పెరిగిపోయిందని కెల్లీ సర్వీసెస్ ఎండీ కమల్ నాథ్ చెప్పారు.

  • Loading...

More Telugu News