: బీటెక్ విద్యార్థినిని హత్య చేసింది ఆమె ప్రియుడేనా?
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి తన ప్రియురాలైన సహవిద్యార్థినిని హతమార్చి చెరువులోకి తోసేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... అల్లూరుకు చెందిన స్వప్నప్రియ కావలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతోంది. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన తిరుమలకుమార్ తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో తిరుమలకుమార్ ను చాలాసార్లు స్వప్న ఆర్థికంగా ఆదుకుంది. అవసరానికి తన గోల్డ్ చైన్ కూడా అతనికి ఇచ్చింది. వీరి మధ్య ప్రేమను స్వప్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. వేరే సంబంధం చూసి ఈ నెల 14న వివాహం నిశ్చయించారు. మూడు రోజుల క్రితం తిరుమలకుమార్ తో కలసి వెళ్లిన స్వప్న ఆ తర్వాత కనిపించడంలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అల్లూరు చెరువులో స్వప్న మృతదేహం కనిపించింది. ఆమె మృతదేహంపై తీవ్రమైన గాయాలు కనిపించడంతో హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.