: దేశంలో 8 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదు: కేంద్ర మంత్రి పీయుష్ గోయల్
‘దేశంలో 8 కోట్ల నివాసాలకు విద్యుత్ సదుపాయం లేదు... స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కోట్లాది మంది ప్రజలు విద్యుత్ సదుపాయం లేక అంధకారంలో మగ్గుతున్నారు’ ఈ మాటలన్నది ఎవరో కాదు... సాక్షాత్తు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్. ఇవాళ (గురువారం) లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ... దేశంలో సుమారు 40 కోట్ల మంది ఇంకా అంధకారంలో మగ్గుతున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యం... ప్రతి ఇంటికి విద్యుత్ సదుపాయం కల్పించడమేనని విద్యుత్ శాఖ మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అవరోధాలు కలుగుతున్నాయని, వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రతి ఇంటికి విద్యుత్ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.