: తమిళనాడులో 'పసుపు జెండా' ఎగరవేసేందుకు రెఢీ అవుతోన్న టీడీపీ
రాష్ట్రం విడిపోవడంతో ప్రాంతీయపార్టీగా ఉన్న టీడీపీకి జాతీయపార్టీ హోదా లభించనుంది. కేవలం హోదాకే పరిమితం కాకుండా... జాతీయపార్టీగా దేశరాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని తెలుగుదేశం తహతహలాడుతోంది. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన మహానాడులో... తెలుగుదేశాన్ని జాతీయపార్టీగా చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల కల్లా మరిన్ని దక్షిణాది రాష్ట్రాలో పాగా వేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా... ముందుగా తమిళనాడులో పాగా వేయాలని టీడీపీ అనుకుంటోంది. ఈ క్రమంలో, తమిళనాడులోని కొంగునాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మొదటి అడుగు వెయ్యబోతోంది. కొంగునాడులోని 50కి పైగా నియోజకవర్గాల్లో 21 లక్షలమందికి పైగా తెలుగువారు ఉన్నారు. వీరు కనీసం 21 నియోజకవర్గాల్లో పార్టీల విజయావకాశాల్ని మార్చగల స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 2016 ఎన్నికల్లో తమిళనాడులో 10 సీట్లు గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ వర్గాలు వ్యూహాన్ని ఖరారు చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో పశ్చిమాన ఉన్న ప్రాంతాన్ని కొంగునాడు అని పిలుస్తారు. ఇప్పటి తమిళనాడు, ఇదివరకు నాలుగు నాడులుగా (ప్రాంతాలుగా) ఉండేది. అవి తొండనాడు, చోళనాడు, పాండ్యనాడు, కొంగునాడు. ఇప్పటికీ తమిళనాడులో ప్రాంతాలవారీగా ఈ విభజన ఉంది. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో ఉన్న కాపు కులాలు (వ్యవసాయ కులాలు) చాలావరకు కొంగునాడును విడిచి వలస వచ్చినవే. కొంగునాడులో అనాదిగా తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. ప్రస్తుతం కొంగునాడు ప్రాంతంలో కోయంబత్తూర్, నీలగిరి, తిరుపూర్, ఈరోడ్ , సాలెం, నమక్కల్, ధర్మపురి, కరూర్, కృష్ణ గిరి జిల్లాలు ఉన్నాయి. అలాగే దిండిగల్, తిరుచిరాపల్లి, విల్లుపురం, పెరంబుదూరు, వెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు కొంగునాడు క్రిందకు వస్తాయి. తమిళనాడు ప్రభుత్వానికి మూడొంతుల ఆదాయం కొంగునాడు నుంచే వస్తోంది. అయినా ఇక్కడ అభివృద్ధి అంతగా జరగకపోవడంతో కొంగునాడును ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ కూడా గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో, తెలుగువాళ్లు అధికంగా ఉండే కొంగునాడు ప్రాంతంలో ముందుగా బలపడాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇప్పటికే అక్కడ 'తెలుగు పిలుపు' అనే పేరుతో ఓ టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంకు మార్టారు వసంతరాయుడు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. ఒక్క చాళనాడు మినహా మిగతా మూడు చోట్ల తెలుగువారు అధికసంఖ్యలో ఉన్నారని వసంతరాయుడు అంటున్నారు. తమిళనాడు ప్రభుత్వాలు తెలుగువారి పట్ల చూపిన నిరాదరణ వల్ల ఇప్పటికే 8వేల తెలుగు బడులు మూతబడ్డాయని ఆయన తెలిపారు. పార్టీల అండలేక... తమిళనాడులో తెలుగువారు నిరాదరణకు గురవుతున్నారని... తెలుగుదేశం తమిళనాడులో నిలదొక్కుకొంటే తమకు అండగా ఉంటుందని ఆయన అంటున్నారు.