: అక్కడి బస్సుల్లో గడ్డాలు, ముసుగులు నిషేధం


చైనాలోనూ టెర్రర్ భయం కనిపిస్తోంది! ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల అక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిన్ ఝియాంగ్ ప్రావిన్స్ లోని కరామాయ్ నగరంలో తీవ్ర ఆంక్షలు విధించారు. పొడవాటి గడ్డాలు, బుర్ఖాలు, స్కార్ఫ్ లు, ముసుగులు, నెలవంక గుర్తు ఉన్న దుస్తులతో ఉన్న వ్యక్తులు బస్సుల్లో ప్రయాణించడంపై నిషేధం విధించారు. ఈ చిహ్నాలన్నీ ఇస్లామ్ కు సంకేతాలని చైనా అధికార వర్గాలు భావిస్తుండడమే నిషేధానికి కారణం. బస్సులే కాకుండా ఇతర ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లోనూ ఇలాంటి వ్యక్తులు ప్రయాణించడాన్ని ఇకపై అనుమతించరు. ఆగస్టు 20న జరిగే స్థానిక క్రీడా పోటీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నా, ఆ తర్వాత కూడా ఈ నిషేధాజ్ఞలను పొడిగించే అవకాశాలున్నాయి. జులైలో జిన్ ఝియాంగ్ ప్రావిన్స్ లోని రెండు పట్టణాల్లో టెర్రరిస్టులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు కత్తులతో స్వైర విహారం చేశారు. పోలీసులు ఈ దాడిపై వెంటనే స్పందించారు. ఆ ఘటనల్లో 100 మంది చనిపోగా, వారిలో 59 మంది టెర్రరిస్టులు కూడా ఉన్నారు. అంతకుముందు మే నెలలో ఉరుంఖీ పట్టణంలోని ఓ మార్కెట్ వద్ద ఆత్మాహుతి దాడి జరగడంతో 39 మంది మరణించారు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే ఆంక్షలు విధించినట్టు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News