: లోక్ పాల్ కమిటీ ఎంపికలో మరింత పారదర్శకత!
అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ తదితరుల సుదీర్ఘ పోరు నేపథ్యంలో యూపీఏ సర్కారు ఎట్టకేలకు లోక్ పాల్ బిల్లుకు తలాడించింది. అయితే, పార్లమెంట్ లో బిల్లును ఆమోదింపజేసేందుకు మన్మోహన్ సర్కారుకు దాదాపు రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. తీరా బిల్లు ఆమోదం పొందాకైనా కమిటీ ఏర్పాటు, విచారణ తదితరాలపై దృష్టి సారించారా అంటే, అదీ లేదు. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించిన కార్యాచరణలోకి దిగినట్లే కనిపిస్తోంది. లోక్ పాల్ కమిటీ ఎంపికపై దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం, పాత విధానాలకు స్వస్తి చెప్పేసి, సరికొత్తగా విధివిధాలను రూపొందించే పనిని చురుగ్గా కొనసాగిస్తోందట. ఈ పనిని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఇప్పటికే దాదాపు పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లోక్ పాల్ కమిటీ సభ్యులను ఎంపిక చేసే కమిటీకి ప్రధాని నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని నేతృత్వంలో కమిటీ అంటే, సర్కారుకు అనుకూలంగా వ్యవహరించే వారే ఉంటారు కదా అన్న ఆరోపణలకు తావు లేకుండా, ఏడుగురితో రూపొందించనున్న ఎంపిక కమిటీలో న్యాయమూర్తులు, న్యాయ నిపుణులనే నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక లోక్ పాల్ కమిటీలో సభ్యులుగా అర్హత ఉన్న ఎవరినైనా సిఫారసు చేసేందుకు కమిటీకి అధికారం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపనుందని విశ్వసనీయ సమాచారం. లోక్ పాల్ కమిటీలో న్యాయమూర్తులకు పెద్ద పీట వేసేందుకు సమాయత్తమవుతోంది. అతి త్వరలో లోక్ పాల్ కమిటీని తెరపైకి తీసుకొచ్చేందుకు మోడీ సర్కారు ఉవ్విళ్లూరుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.