: నన్ను తిట్టకపోతే కేసీఆర్ రాజకీయంగా బతకలేడు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీని ఎప్పటికప్పుడు ఆడిపోసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా బతకాలనుకుంటున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనను తిట్టకపోతే కేసీఆర్ రాజకీయంగా బతకలేడని... అందుకే ఎప్పుటికప్పుడు అవాస్తవమైన అవాకులు చవాకులు పేలుతూ, పబ్బం గడుపుకుంటున్నాడని చంద్రబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా... దాన్ని తనకు అంటగట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్లాంట్లను తాను పని గట్టుకుని ఆపు చేసి తెలంగాణలో విద్యుత్ కొరత సృష్టించానని చేసిన ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. ప్రతీ యేడు సాధారణంగా జరిగే మరమ్మతుల్లో భాగంగా... వాటిని నిలుపుదల చేశామని....ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు విద్యుత్ ఆపు చేసి మరమ్మతులు చేసేవారని ఆయన తెలిపారు. ఈ విషయాలు తెలిసినప్పటికీ... కేసీఆర్ దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించాడని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న అసత్యప్రచారాలను దీటుగా ఎదుర్కోవడంతో పాటు... తెలంగాణ ప్రజలకు అన్ని విషయాల్లో వాస్తవాలను వివరించేందుకు వెనుకాడవద్దని ఆయన తెలంగాణ టీడీపీ నాయకులకు సూచించారు.