: గెయిల్ నిర్లక్ష్యంతోనే ‘నగరం’ ఘటన!
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) నిర్లక్ష్యం కారణంగానే నగరం ప్రమాదం చోటుచేసుకుందని దర్యాప్తులో వెల్లడైంది. గ్యాస్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి కీలక భూమిక పోషిస్తున్న గెయిల్, పాతబడ్డ గ్యాస్ పైపులను మార్చేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. అంతేకాక ప్రమాదం జరిగే అవకాశాలున్నాయన్న విషయాన్ని ఆ సంస్థ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. గెయిల్ నిర్లక్ష్యం పుణ్యమాని తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన ఘోర ప్రమాదంలో 22 మంది మరణించగా, గ్రామం తగలబడిపోయింది. గ్యాస్ అంటేనే బెంబేలెత్తేలా జనాల్లో భయాన్ని గూడుకట్టుకునేలా చేసింది. ఈ ఘటనపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని సంయుక్త కార్యదర్శి ఆర్ కే సింగ్ నేతృత్వంలోని బృందం ఇటీవలే తనకు అప్పజెప్పిన పనిని పూర్తి చేసింది. నివేదిక పూర్తి పాఠం వెల్లడి కాకపోయినప్పటికీ, పలు కీలక అంశాలపై దర్యాప్తు కమిటీ విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గ్యాస్ పైపుల్లో అప్పటికే గుర్తించిన మరమ్మతులను క్లాంపులు, గుడ్డ పేలిక వంటి వాటితో సరిపెట్టిన అధికారులు లీకేజీలను శాశ్వతంగా నివారించే చర్యల వైపు దృష్టి సారించిన దాఖలాలు కనిపించలేదు. అంతేకాక మరమ్మతులు కూడా పూర్తి స్థాయిలో చేబట్టలేదని తేలింది. నగరం ఘటన తర్వాత కూడా అన్ని వైపుల నుంచి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలోనే కొంతమంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన గెయిల్, కంటితుడుపు చర్యలనే చేపట్టింది తప్పించి, భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికీ దృష్టి సారించలేదని కమిటీ తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం.