: తెలంగాణలో వాడవాడలా జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. వరంగల్ జిల్లా బాలసముద్రంలో ఏకశిల పార్కులో జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నిజాం కళాశాల విద్యార్థులు నివాళులర్పించారు. మహబూబ్ నగర్ లో జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రియదర్శిని ప్రారంభించారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ఏవీఎం కళాశాలలోనూ జయశంకర్ జయంతి వేడుకలు జరిగాయి. వరంగల్ లో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ కిషన్, ఎమ్మెల్యే కొండా సురేఖ నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకల్లో ప్రజలు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.