: ప్రియాంకా లావో... కాంగ్రెస్ బచావో: కాంగ్రెస్ కార్యకర్తల కొత్త నినాదం
'ప్రియాంకా లావో... కాంగ్రెస్ బచావో' (ప్రియాంకాను తీసుకురండి... కాంగ్రెస్ ను కాపాడండి) నినాదాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల్లో మిన్నంటుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత రాహుల్ గాంధీ సామర్థ్యంపై కాంగ్రెస్ వర్గాల్లో కూడా అపనమ్మకం మొదలైంది. దీంతో పార్టీని బతికించుకోవాలంటే ప్రియాంకాగాంధీకి కాంగ్రెస్ లో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పాలని మెజార్టీ కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వర్గాలు వీలున్నప్పుడుల్లా కాంగ్రెస్ అగ్రనాయకుల వద్ద ప్రియాంకాగాంధీ ప్రస్తావనను గట్టిగా తీసుకువస్తున్నాయి. అయితే, మరికొందరు మాత్రం సోనియా, రాహుల్, ప్రియాంకల త్రయం కాంగ్రెస్ పార్టిని మళ్లీ అధికారంలోకి తీసుకురాగలరని భావిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ప్రియాంకా లావో నినాదం ఊపందుకోవడంతో పార్టీ అగ్రనేతలు కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పార్టీ కార్యక్రమాల్లో ప్రియాంకాగాంధీ మరింత చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ సీనియర్ నాయకుడు, సోనియా గాంధీ నమ్మినబంటు ఆస్కార్ ఫెర్నాండెజ్ నేషనల్ మీడయాతో మాట్లాడుతూ అన్నారు.