: రాణే... దారికొచ్చారు!


నారాయణ్ రాణే! ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానూ గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటిదాకా మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ కేబినెట్ లో మంత్రి. చవాన్ ను పదవి నుంచి తప్పించి, ఆ కుర్చీలో నిన్నే కూచోబెడతామంటూ పార్టీ హామీ ఇవ్వడమే తప్పించి, దానిని అమలు చేసే సూచనలు కనిపించలేదు. అంతేకాక కొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా లాభం లేదనుకుని, మహారాష్ట్ర సర్కారుతో పాటు పార్టీ అధిష్ఠానంపై బహిరంగంగానే విరుచుకుపడిన ఆయన 15 రోజుల క్రితం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులతో దఫదఫాలుగా జరిగిన చర్చల్లో ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చల్లో భాగంగా ‘కేవలం సర్దుబాటు’ తరహాలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని ఆయన ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. తానెప్పుడూ పదవుల కోసం వెంపర్లాడలేదని, పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయని బీరాలు పలికిన రాణే, మరి రాజీనామా ఎందుకు చేశారన్న విషయంపై మాత్రం నోరు విప్పలేడటం లేదట. చవాన్ నేతృత్వంలో ఎన్నికలకు వెళితే, పార్టీ పరాజయం చవిచూడటం ఖాయమన్న రాణే, తాజాగా పార్టీ ఆదేశాల మేరకు చవాన్ తో కలిసే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు మరి. ఏదేమైనా, రాణే నిర్ణయంతో పార్టీ అధిష్ఠానానికి కాస్తైనా ఊరట లభించినట్లే కదా.

  • Loading...

More Telugu News