: భారత్, చైనాలతో థాయ్ రైల్వే నెట్వర్క్ అనుసంధానం
థాయ్ లాండ్ లోని మిలిటరీ ప్రభుత్వం (జుంటా) తమ రైల్వే నెట్వర్క్ ను భారత్, చైనాలతో అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. తద్వారా రవాణా మెరుగవుతుందని అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాలు తమ ఉత్పత్తులకు ప్రముఖ మార్కెట్లని థాయ్ జుంటా సర్కారు భావిస్తోంది. జుంటా ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ పీస్ అండ్ ఆర్డర్ (ఎన్సీపీఓ) చీఫ్ జనరల్ ప్రయుథ్ చాన్ ఓచా మాట్లాడుతూ, భారత్, చైనాలతో చర్చలు ఫలప్రదమయ్యాయని తెలిపారు. తమ ప్రతిపాదనలకు వారు అంగీకారం తెలిపారని ప్రయుథ్ వివరించారు. అంతేగాకుండా ఎప్పటి నుంచో ఉన్న మీటర్ గేజి రైల్వే ట్రాక్ లను కూడా బ్రాడ్ గేజ్ గా మార్చనున్నట్టు ఆయన తెలిపారు. ఆ మీటర్ గేజి ట్రాకులు ఎప్పుడో రామా-5 రాజరిక పాలన నాటివని ప్రయుథ్ వెల్లడించారు. భారత్, చైనాలతో పాటు ఇతర ఆసియా దేశాలకూ రైల్వే నెట్వర్క్ అనుసంధానం చేస్తామని చెప్పారు.