: చైనాలో పెను భూకంపం... ఇప్పటివరకు 367 మంది మృతి
చైనాలోని యున్నన్ రాష్ట్రంలో వచ్చిన పెనుభూకంపానికి ఇప్పటివరకు 367 మంది చనిపోగా... 1800 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 167 మంది జాడతెలియడం లేదు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపతీవ్రత 6.5 గా నమోదయింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం భూమి లోపల 1.6 కిలోమీటర్ల లోతులో సంభవించిందని చైనా అధికారులు అంటున్నారు. ఈ భూకంపం కారణంగా 12 వేల ఇళ్లు కుప్పకూలగా... మరో 30 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని చైనా ప్రభుత్వం తెలిపింది. యున్నన్ రాష్ట్రంతో పాటు గుజాహో, సిచ్వాన్ రాష్ట్రాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. భూకంపం సృష్టించిన విధ్వంసానికి యున్నన్ రాష్ట్ర ప్రజలు ఇంకా షాక్ లో ఉన్నారు. నిన్న సాయంత్రం హఠాత్తుగా ఇళ్లు అటూ ఇటూ ఊగడం, షెల్ఫ్‌లలోని వస్తువులు కిందపడిపోతుండడంతో చాలామంది ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం వచ్చిన సమయంలో అపార్ట్ మెంట్స్ లో ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఓ పక్క పొరుగున ఉన్న భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు వీధుల్లోకి పరుగులు తీసారు. మొబైల్ ఫోన్లు కూడా పని చేయకపోవడంతో బంధుమిత్రులు, కుటుంబసభ్యుల క్షేమసమాచారాలు తెలియక చాలామంది చైనా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చైనా ప్రభుత్వం సహాయక బృందాలను పంపించడంతో పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి