: గవర్నర్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పలు కలిశారు. ఉన్నత విద్యా మండలిపై సమగ్ర సమాచారంతో తమను కలవాలని గవర్నర్ ఆదేశాల మేరకు వీరు ఏపీ ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ తో కలిసి ఆయనను కలిశారు. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ముగిసిపోతోంది, అడ్మిషన్లు పూర్తి చేద్దామని సూచిస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నపళంగా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాల వల్ల రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవడం మంచిది కాదని ఆయన సూచించారు. ఇందులో ప్రభుత్వాలు ప్రయోజనాలు చూడడం సరికాదని ఆయన హితవు పలికారు. ఎమ్ సెట్ అడ్మిషన్లపై రేపు సుప్రీంకోర్టు తీర్పుఇవ్వనుందని, అది కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిలషించారు.