: కేసీఆర్ కు కంగ్రాట్స్ చెప్పిన సినీ నటుడు సుమన్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ అభినందనలు తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి దిశగా పయనించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న కేసీఆర్ కు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. తెలంగాణలో రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీ నిర్మిస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల సుమన్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా సిటీ నిర్మాణం పూర్తయితే వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రపంచ సినిమాకు హైదరాబాదు ప్రధాన కేంద్రం కావాలని, కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దిశగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే అన్ని భారతీయ భాషా చిత్రాల నిర్మాణం హైదరాబాదులో జరుగుతోందని, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మున్ముందు అది మరింత పెరుగుతుందని సుమన్ చెప్పారు. సినిమా నిర్మాణానికి కావాల్సిన సాంకేతిక శక్తి హైదరాబాదులో అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.