: ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాం: మంత్రి పల్లె రఘునాథరెడ్డి


ఇసుక క్వారీల్లో క్రయవిక్రయాల్లో మహిళలకూ భాగస్వామ్యం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఇసుక క్వారీల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించామన్నారు. ఇసుక రీచ్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన చెప్పారు. విశాఖ, వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. "సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీ సహా అన్ని దేవాలయాల కమిటీలను రద్దు చేసింది. ఏపీలో ఎన్టీఆర్ పేరిట ‘అన్న క్యాంటీన్’లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది" అని మంత్రి పల్లె చెప్పారు. అయితే, తొలుత ప్రయోగాత్మకంగా అన్న క్యాంటీన్లను మూడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ ధరలకే అల్పాహారం అందించేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని కరవులేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News