: హిమాచల్ లో యాపిల్ కంటే టొమాటోలే రేటెక్కువ!
ఎక్కువ ధర పలుకుతుండటంతో టొమాటో పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతంటే, యాపిల్ కంటే దాని రేటే ఎక్కువగా ఉందట. మంచు ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లో యాపిల్ లు ఎంత బాగా పండుతాయో ధర కూడా అంతే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా టొమాటో ధర ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో యాపిల్ ల కంటే వీటి ధరే టాప్ లో ఉందట. స్థానిక మార్కెట్ లో టొమాటోల టోకు ధర రూ.40 నుంచి రూ.45 ఉంటోంది. ఈ క్రమంలో హిమాచల్ లో కోశల్ భరద్వాజ్ అనే పండ్ల తోట యజమాని మాట్లాడుతూ, "అంతకుముందు ఒక ట్రేలో ఇరవైఐదు కేజీల టమాటాలు తీసుకొస్తే రూ.150 నుంచి రూ.250 అయ్యేది. ఈసారి కళ్లు చెదిరిపోయేలా వెయ్యి రూపాయల నుంచి పదకొండొందలు పలుకుతోంది. దురదృష్టం ఏంటంటే, చాలా తక్కువ స్థలంలోనే రైతులు ఇక్కడ టొమాటోలు పండించారు. అయితే, ఈసారి కూరగాయలు మంచి రేటు పలకడం చాలా సంతోషంగా ఉంది" అని అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కులు అనే జిల్లాలో 65వేల 186 హెక్టార్ల వ్యవసాయ భూమిలో యాపిల్ లు, మిగతా పండ్లు పండిస్తారట.