: సోనియా లక్ష్యంగా నా పుస్తకం రాయలేదు: నట్వర్ సింగ్


కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సంబంధించిన పలు విషయాలు అందులో పొందుపరచడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్' అనే పేరుతో రాసిన ఈ పుస్తకం నేడు ఢిల్లీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నట్వర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సోనియాగాంధీ లక్ష్యంగా తన పుస్తకం రాయలేదన్నారు. తన పుస్తకంలో అన్ని విషయాలను ప్రస్తావించినట్లు చెప్పారు. అయితే, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి సోనియాకు ఫైళ్లు వెళ్లిన మాట ముమ్మాటికీ వాస్తవమని నట్వర్ వెల్లడించారు. ఇక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమెవరని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రచారం చేసినవారు బాధ్యులు కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ లో పెద్దలకు ఇచ్చిన గౌరవం తనకు దక్కలేదన్న నట్వర్... పార్టీలో జరిగిన కొన్ని విషయాలకు సంబంధించిన నిజాలు బయటపెట్టొద్దని ప్రియాంకాగాంధీ తనను కోరినట్లు చెప్పారు. ఆ అవమానాలకు తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రియాంక చెప్పారని తెలిపారు. సోనియాగాంధీ ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుపడ్డారన్న అంశంపైన మాట్లాడిన నట్వర్, ఈ విషయంలో రాహుల్ వైఖరి సరైనదేనన్నారు. "తండ్రి, నానమ్మను పొగొట్టుకున్నా... తల్లిని కూడా పోగొట్టుకోలేను" అని రాహుల్ అన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News