: ప్రతీ పైసా ఆలోచించి ఖర్చు పెట్టండి: మంత్రులకు, ఉన్నతాధికారులకు ఏపీ సర్కార్ హుకుం
విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ తన ఆర్థికపరిస్థితిని చక్కదిద్దుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు, మంత్రులకు ప్రతీ పైసా ఆలోచించి ఖర్చు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభ్వుత్వ శాఖలు పాటించాల్సిన పది పొదుపు సూత్రాలు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్క్యులర్ లోని ముఖ్యాంశాలు ఇవీ... * ఉద్యోగులు, మంత్రులు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎట్టిపరిస్థితుల్లోను సమావేశాలు నిర్వహించకూడదు. * విమానాల్లో మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన ఇతరులు కేవలం ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించాలి. * కొత్త వాహనాలను కొనుగోలు చేయరాదు... అంతగా అవసరమైతే తాత్కాలికంగా అద్దె వాహనాలు వాడుకోవాలి. * ప్రతీ శాఖలోనూ అత్యవసరమైతే తప్ప కొత్త ఉద్యోగాలను కల్పించరాదు. ఉన్నవారినే సర్దుబాటు చేసుకోవాలి. * మంత్రులు, ఉన్నతాధికారులు విలాసాలు, విదేశీ యాత్రలు పూర్తిగా తగ్గించాలి. ఈ మార్గదర్శాలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. పంచాయతీ ఆఫీస్ మొదలకుని... సెక్రటేరియట్ వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పథకాలకు, కార్యక్రమాలకు ఈ ఆర్థిక నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.