: జమ్మూకాశ్మీర్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఐఎస్ఐఎస్?
ఐఎస్ఐఎస్... ఇప్పుడు ప్రపంచం మొత్తం దీని గురించే చర్చిస్తోంది. ఇరాక్ లో నరమేధం సృష్టిస్తోంది ఈ మిలిటెంట్ సంస్థే. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన జెండాలు జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలు ఇస్లామిక్ వేర్పాటువాద సంస్థలకు నిలయమైన కాశ్మీర్ లో ఐఎస్ఐఎస్ (ఐఎస్ జేకే) జెండాలు కనిపించడం... భవిష్యత్తులో ఎదురుకానున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. భారత్ మన టార్గెట్ అంటూ కొద్ది రోజుల క్రితం ఐఎస్ఐఎస్ చీఫ్ ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే. దీనికి తోడు, సిరియా నుంచి చైనా వరకు అన్ని దేశాలపై ఐఎస్ఐఎస్ ఆధిపత్యం వహించాలని ఆ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో, మన ఇంటలిజెన్స్ వ్యవస్థ అలర్ట్ అయింది. ఇప్పటికే ఐఎస్ఐఎస్ ఆనవాళ్లపై దృష్టి సారించింది. అంతేకాకుండా, ఇరాక్ నుంచి తిరిగి వస్తున్న ప్రతి వ్యక్తిపై నిఘా ఉంచుతోంది. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే కొందరు భారతీయులు ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ మిలిటెంట్లతో కలసి పనిచేస్తున్నారు. ఇరాక్ లో జరుగుతున్న పవిత్ర యుద్ధంలో పాల్గొనకపోతే... భగవంతుడు క్షమించడని వారు భావిస్తున్నారు. కొంతమంది యువకులు ఉద్యోగం కోసం వెళుతున్నామని చెప్పి వెళ్లి.... ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ లో చేరిపోయామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయంతో వారి కుటుంబ సభ్యులు సైతం కలవరానికి గురవుతున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. తెలియకుండా ఇంకా ఎంతమంది ఐఎస్ఐఎస్ తో చేతులు కలిపారో అన్న ప్రశ్న... భవిష్యత్తు భద్రతకు సవాలు విసురుతోంది. ఇప్పుడు శ్రీనగర్ లో కనిపించిన ఐఎస్ఐఎస్ జెండాలు... చాపకింద నీరులా విస్తరిస్తున్న ఆ సంస్థ కార్యకలాపాలను చెప్పకనే చెబుతున్నాయి.