: భయపడ్డంతా జరుగుతోంది... యుద్ధమే తక్కువ!


రాష్ట్ర విభజనకు ముందు భయపడ్డట్టే జరుగుతోంది. సాధారణ పౌరులు, మేధావులు, శ్రీకృష్ణ కమిటీ వ్యక్తం చేసిన అనుమానాలన్నీ నిజమవుతున్నాయి. బాహాబాహీకి దిగడం ఒక్కటే తక్కువ... రాష్ట్ర విభజన కోసం పెరిగిన విద్వేషాన్ని కొనసాగించడంలో తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. రోజుకో జీవోతో రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక వివాదం రేపేందుకు నేతలు ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చే వాహనాలన్నీ రవాణా పన్ను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, రాజధాని నగరాన్ని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెప్పడం అగ్నికి ఆజ్యం పోయడమే. 2015 వరకు రవాణాపన్ను విధించకూడదని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఉమ్మడి రాజధానికి వచ్చే ఆంధ్రులను ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది. మరోవైపు ఏపీకి కేటాయించిన పాత అసెంబ్లీ హాలు చారిత్రక భవనం కనుక దానికి మరమ్మతులు చేయడం సరికాదని రామలింగారెడ్డి పేర్కొంటున్నారు. మరమ్మత్తులు చేయడం సీమాంధ్రుల ఆగడం అని కూడా ఆయన అనేశారు. ఆంధ్రప్రదేశ్ నేతలు రాజధానిని తక్షణమే వదిలివెళ్తే బాగుంటుందని రామలింగారెడ్డి సూచించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఇప్పుడే నిర్వహించకూడదని, తాము నిర్వహించనున్న 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకం రూపొందిన తరువాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ను అక్టోబర్ వరకు వాయిదా వేయాలంటూ ఉన్నత విద్యాశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా గైర్హాజరైంది. అలా చేస్తే విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోతారని, దాని ప్రభావం వారి పీజీ ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలపై కూడా పడుతుందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. కాగా, ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉంది. ఇవి కాకుండా విద్యుత్తు, కృష్ణా జలాల పంపిణీలో రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ వివాదం ఉండనే ఉంది. ఉద్యోగుల పంపిణీ, స్థానికత వివాదం మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి. రాష్ట్ర విభజన అస్పష్టంగా ఉండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం ఒక్కటే తక్కువ తప్ప నేతల వ్యవహార శైలితో ఆ ముచ్చట కూడా తొందర్లోనే తీరిపోనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News