: ‘ఆధార్’ కార్డు నమోదు ఇప్పుడు అవసరమేనా?
ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. ఆగస్టు 7వ తేదీలోగా ఆధార్ నమోదును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిత్యావసర వస్తువుల సరఫరా, రుణమాఫీ తదితర పథకాలకు ఆధార్ అవసరమని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 11 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులుండగా, 2.5 లక్షల మంది గులాబీ కార్డుదారులున్నారు. వీరందరూ ఆధార్ కార్డుల నమోదుతోపాటు సెల్ ఫోన్ నెంబర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది. జిల్లాలో మొత్తం 35 లక్షల యూనిక్ నెంబర్లకు గాను... ఇప్పటికే 29 లక్షల యూనిక్ నెంబర్ల నమోదును పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆధార్ కార్డు కాకుండా, వేరే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని భావిస్తున్నారు. ఫించన్లు, స్కాలర్ షిప్పులు తదితర పథకాలకు ఈ సరికొత్త టెక్నాలజీని వాడాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డులను ముడిపెట్టవద్దంటూ సూచించటంతో చాలా మంది ఆధార్ కార్డు నమోదుకు ముందుకు రావడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ నమోదు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మున్ముందు ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్ కీలకం కానున్నదని కేంద్రం పేర్కొంది. దీంతో ఆయా ప్రభుత్వ పథకాల కోసం ‘ఆధార్’ ఆధారమని తేలిపోయింది.