: ముద్దులు...హై ఫైవ్ లు వద్దు... షేక్ హ్యాండ్స్ అసలే వద్దు!
సినిమాల ప్రభావమో... పాశ్చాత్య సంస్కృతిపై నున్న మోజో తెలియదు కానీ, ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెట్టడం మర్చిపోయాము. పరిచయస్తులు కనపడగానే వారి బుగ్గపై ముద్దు (పెక్), హై ఫైవ్ (అరచేతితో ఎదుటి వారి అరచేయిని చరచడం), షేక్ హ్యాండ్ (ఎదుటి వారి చేతిని పట్టుకుని ఊపడం), ఆలింగనం చేసుకోవడం చేస్తున్నాం. వీటి వల్ల బంధం బలపడడం సంగతి పక్కన పెడితే... అనారోగ్యాలు రావడం ఖాయమని అంటున్నారు బ్రిటిష్ పరిశోధకులు. బ్రిటన్ లోని అబెరిస్ట్విత్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కొత్త పలకరింపుల కారణంగా కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తోందని గుర్తించినట్టు వారు తెలిపారు. బుగ్గపై ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ద్వారా ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి భారీ సంఖ్యలో బాక్టీరియా ప్రవేశిస్తుందని పరిశోధనలో తేలింది. హైఫైవ్, షేక్ హ్యాండ్, పిడికిలి (బంప్) గుద్దడం ద్వారా ఎదుటివారి అరచేతుల్లోని బాక్టీరియా చేరుతుందని పరిశోధకులు తెలిపారు. వీటన్నింటికి బదులు ఫుల్ హ్యాండ్స్ షర్టు వేసుకుని మోచేతులు తాటించుకుంటే సరిపోతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. అందుకే అన్నీ గమనించిన మన పూర్వీకులు నమస్కారం కనిపెట్టి సంస్కృతిలో భాగం చేశారు. నమస్కారం పెడితే ఎవరి బాక్టీరియా వారి వద్దే ఉంటుంది. ఇతరుకు పాకే ప్రసక్తే లేదు!