: ఎంపీలకూ ప్రోగ్రెస్ కార్డులిచ్చేస్తున్నారు!
ఎల్ కేజీ చదువుకున్న పిల్లలకే కాదు... ఇక ఇప్పుడు ఎంపీలకూ ప్రోగ్రెస్ కార్డులివ్వాలని యోచిస్తున్నారు. ఈ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా ఎంపీల పనితీరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. తమ ఎంపీల కోసం రిపోర్టు కార్డులను ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాలకు హాజరు, ప్రశ్నలు అడగడం, చర్చల్లో పాల్గొనడం... తదితర అంశాలకు సంబంధించి పార్లమెంటు సభ్యుల పనితీరును రిపోర్డు కార్డుల్లో పొందుపరచనున్నారు. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు కూడా వారి పనితీరుపై అధ్యయనం ఉంటుందని తెలిసింది. అలాగే ప్రతి రోజు కనీసం ఒక కేంద్ర మంత్రి అయినా ఢిల్లీలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ప్రధాని ఆదేశించినట్టు సమాచారం.