: పాక్ జట్టు కోచ్ గా నేను రెడీ: ఇంజమామ్
పాకిస్తాన్ బ్యాటింగ్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ తాను జాతీయ జట్టు కోచింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. బోర్డు కోచింగ్ కు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపడతానని స్పష్టం చేశాడు. ఈ 44 ఏళ్ళ భారీకాయుడు గతంలో రెండు సార్లు కోచింగ్ అవకాశాలు రాగా, తిరస్కరించాడు. మొదటిసారి అవకాశం వచ్చినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా వదులుకున్నాడు. ఇక, రెండో పర్యాయం చాన్సొచ్చినా... తనను దరఖాస్తు విధానం ద్వారా కాకుండా, నేరుగా ఎంపిక చేయాలని పట్టుబట్టి, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు.