: ఎస్టీనని ఇంత అవమానమా?... ఇక వైఎస్సార్సీపీలో ఉండలేను!:ఎంపీ గీత
వైఎస్సార్సీపీ అరకు లోక్ సభ సభ్యురాలు కొత్తపల్లి గీత పార్టీ వీడడం ఖాయమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీ గీత మీడియా ముందుకు వచ్చారు. అరకులో ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారని అన్నారు. పార్టీలోని నేతలు పార్టీ చేపట్టే కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. పార్టీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని ఆమె ఆరోపించారు. ఎస్టీ మహిళనని తనను చాలా అవమానించారని ఆమె చెప్పారు. ఆత్మాభిమానం చంపుకుని వైఎస్సార్సీపీలో కొనసాగలేనని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతల వ్యవహార శైలితో మహిళా నేతలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. త్వరలో చాలా మంది మహిళా నేతలు వైఎస్సార్సీపీ వీడుతారని కొత్తపల్లి గీత అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథాన పురోగమిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.