: ఏపీ రాజధాని ఇష్యూ: విజయవాడ-గుంటూరు, దొనకొండల మధ్యే ప్రధాన పోటీ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ-గుంటూరులతో... ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం తీవ్రంగా పోటీపడుతోంది. దొనకొండను రాజధానిని చేయాలనే వాదన రోజురోజుకూ బలపడుతోంది. ఇటీవలే మాజీ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఛీప్ సెక్రటరీ కె.జయభారతరెడ్డిలు దొనకొండను రాజధాని చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరిస్తూ... ఒక నివేదికను తయారుచేశారు. నివేదికను తయారుచేయడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆ నివేదికను అందజేశారు. విజయవాడ-గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలంటే భూమి సమస్య ఉత్పన్నం అవుతోందని... కానీ దొనకొండ ప్రాంతంలో భూమి సమస్య ఉండదని వారు చంద్రబాబుకు తెలియజేశారు. దొనకొండ ప్రాంతం చుట్టూ లక్షన్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని వారు చంద్రబాబుకు చెప్పారు. దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటే సువిశాలమైన రాజధానిని, పక్కా ప్రణాళికతో నిర్మించుకోవచ్చని వారు చంద్రబాబు దగ్గర వాదించారు. అంతేకాకుండా దొనకొండ అటు రాయలసీమకు, ఇటు కోస్తాకు సరిగ్గా మధ్యలో ఉంటుందని వారు చంద్రబాబు దగ్గర వ్యాఖ్యానించారు. అయితే, దొనకొండ అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉందన్న వాదనపై ప్రభుత్వ వర్గాలు అనుమానపడుతున్నాయి. అలాగే, దొనకొండ ప్రాంతంలో నీటి సమస్యపై కూడా ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి.