: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వారు వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.