: పవన్ కల్యాణ్ టార్గెట్ 'ఐదు రాష్ట్రాలు'
జనసేన పార్టీ నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే పవన్ తన పార్టీ గుర్తుగా 'పిడికిలి'ని ఎంచుకున్నారని... ఆ వివరాలను ఆగస్ట్ 15న ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ చెబుతారని మీడియా వర్గాలకు అనధికారికంగా సమాచారం అందింది. తాజాగా మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ సూచనలు, సలహాలతో ఆయన మిత్రుడు, ఫ్రముఖ ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి పార్టీ సింబల్ 'పిడికిలి'ని ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అలాగే జనసేన పార్టీ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజురవితేజ్ కు పార్టీ కోర్ కమిటీ ఏర్పాటు బాధ్యతలను పవన్ అప్పజెప్పినట్టు సమాచారం. మరో ఆసక్తికర విషయమేమిటంటే, జనసేన పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పవన్ కల్యాణ్ పరిమితం చేయాలనుకోవడం లేదు. ఈ రెండు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఐదు రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్ఠపరిచేందుకు పవన్ కల్యాణ్ అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నారు. ఓ వైపు 'గోపాల...గోపాల' షూటింగ్ లో పాల్గొంటూనే... మరో వైపు జనసేన పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో తీరికలేనంత బిజీగా పవన్ ప్రస్తుతం ఉన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్ల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు.