: ఆమ్ ఆద్మీ అలసిపోయిందా..?
దేశ రాజకీయ రంగంలో పెను సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అలసిపోయినట్టే కనిపిస్తోంది. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు నేడు దేశ పాలనను చేపట్టిన బీజేపీకి ఆ పార్టీ పట్టపగలే చుక్కలు చూపించింది. మూడు పర్యాయాలు ఢిల్లీ సీఎం పీఠం అధిష్టించి, రికార్డులు నెలకొల్పిన నాటి సీఎం షీలా దీక్షిత్ కు భారీ పరాజయాన్ని రుచి చూపించింది. ఇక పార్టీ తరఫున పోటీ చేసిన ఏమాత్రం రాజకీయ అనుభవం లేని యువకులు... రాజకీయాల్లో కాకలు తీరిన హేమాహేమీలను ఢీకొని విజయదుందుభి మోగించారు. అంతేనా, ఏకంగా ఢిల్లీ సీఎం పీఠంపై పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆసీనులయ్యారు. పీఠమెక్కగానే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు విద్యుత్ చార్జీల తగ్గింపు, గృహాలకు నీటి కోటా పెంపు తదితర నిర్ణయాలతో రొటీన్ రాజకీయాలకు భిన్నంగానే వ్యవహరించారు. ప్రజల మన్ననలను పొందారు. అయితే ఇదంతా కేవలం కొన్ని రోజులకే పరిమితమైంది. ఢిల్లీ శాంతిభద్రతల అంశంపై యూపీఏ సర్కారుతో కయ్యానికి కాలుదువ్వారు. సీఎం పీఠంపై కూర్చుని ఆందోళనలకు దిగి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ వారణాసిలో నరేంద్ర మోడీపై పోటీకి దిగి, తన పోరాట పటిమను చాటుకున్నారు. అదంతా గతం! ప్రారంభంలోనే వేగంగా పరులుగు తీసిన ఆ పార్టీకి ఆయాసం వచ్చినట్లుంది. పరుగు కొనసాగించలేను, కాస్త విశ్రమిస్తానంటూ చెబుతోంది. తాజాగా దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు తెరలేవనుంది. పార్టీకి బాగా పట్టుందని భావిస్తున్న హర్యానాతో పాటు చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్లలో దాదాపు ఎన్నికలకు తెర లేచినట్టే. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నట్లు పార్టీ వర్గాలు ఇదివరకు చెప్పుకొచ్చాయి. అయితే తాజాగా ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం లేదని పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ చల్లగా చెప్పేశారు. పరిమిత వనరుల నేపథ్యంలోనే పోటీకి దిగలేకపోతున్నామని ఆయన ఆదివారం ప్రకటించారు. అయితే పంజాబ్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తామని చెప్పారు. పంజాబ్ లో కేవలం రెండు అసెంబ్లీలకు మాత్రమే ఉప ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ప్రకటన ఊహించిందే అయినా, మరీ ఇంతగా షాకిస్తారని మాత్రం అనుకోలేదన్న విశ్లేషణలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ రాజకీయాలను మార్చేస్తామంటూ ఎంత స్పీడుతో పరుగు మొదలెట్టారో, అంతే స్పీడుగా చాప చుట్టేస్తున్నారన్న విమర్శలు కేజ్రీవాల్ పై వెల్లువెత్తుతున్నాయి.