: రెండు రాష్ట్రాల్లోనూ విప్రో పెట్టుబడులు!


భారత టెక్నాలజీ దిగ్గజం విప్రో, తెలుగు గడ్డమీద మరింత విస్తృత పరిధిలో కార్యకలాపాలను సాగించనుంది. ఇప్పటికే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో కాలుమోపిన విప్రో, తాజాగా ఇటు తెలంగాణలో మరింత మేర విస్తృతం కానుండగా, కొత్తగా ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగిడనుంది. ఆదివారం విప్రో ఛైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతోనూ వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోనూ కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రేమ్ జీ ప్రకటించారు. రెండు రాష్ట్రాలూ తమకు ప్రాధాన్యత గలవేనని ఆయన స్పష్టీకరించారు. చంద్రబాబు నాయుడితో భేటీ సందర్భంగా, విశాఖపట్టణంలో ఐటీ సెజ్ ను నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన ప్రేమ్ జీ, అందుకోసం రూ. 500 కోట్ల మేర నిధులను పెట్టుబడిగా పెట్టనున్నట్లు చెప్పారు. సెజ్ ఏర్పాటుతో ఐదేళ్ల కాలంలో ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు విప్రో వర్గాలు వెల్లడించాయి. ప్రేమ్ జీ ప్రతిపాదనకు ముగ్ధుడైన చంద్రబాబు అక్కడికక్కడే విప్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. విశాఖ సెజ్ ఏర్పాటు తర్వాత క్రమంగా విజయవాడ, కాకినాడ, తిరుపతి నగరాలకు కూడా తమ సేవలను విస్తరిస్తామని ప్రేమ్ జీ ప్రకటించారు. ఇదిలా ఉంటే, సంతూర్ సబ్బులు ఇకపై ఏపీలోనూ తయారు కానున్నాయి. అనంతపురం జిల్లా హిందూపూర్ లో సంతూర్ సబ్బుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు ప్రేమ్ జీ ప్రకటించారు. మరోవైపు తెలంగాణ సీం కేసీఆర్ తో భేటీ అయిన ప్రేమ్ జీ, హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలపైనా దృష్టి పెడతామని ప్రకటించారు. తెలంగాణలో ఐటీ, హార్డ్ వేర్ పార్కులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్న ప్రేమ్ జీ, హైదరాబాద్ లో తమ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తద్వారా హైదరాబాద్ ను ఐటీ ఆధారిత సేవల విభాగంలో దేశంలోనే అగ్రభాగాన నిలిచేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రేమ్ జీకి విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించబోతున్న విషయాన్ని ఆయన ప్రేమ్ జీకి చెప్పారు.

  • Loading...

More Telugu News