: అందమైన అమ్మాయి ఫొటోతో యువకుడికి కుచ్చుటోపీ


సవ్యమైన సంబంధాలకు వేదికగా మలుచుకోవాల్సిన సోషల్ మీడియాను కొందరు వంచకులు తమ పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో అందమైన ఫొటో పెట్టి ఓ యువకుడికి రూ.14 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టాడు. వివరాల్లోకెళితే... మంగుళూరులో నివాసముండే షేర్ ఖాన్ (23) అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి ఓ ఎత్తుగడ వేశాడు. ఫేస్ బుక్ లో ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టి ఖాతా తెరిచాడు. మహ్మద్ వాసిం అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్న షేర్ ఖాన్ తరచూ ఏదో ఒక కారణం చెబుతూ వాసిం నుంచి డబ్బులు గుంజేవాడు. ఓసారి పర్సు పోయిందని, మరోసారి ఇంటిస్థలం పరిష్కారం కోసమని.. ఇలా మొత్తమ్మీద రూ. 14 లక్షల వరకూ తీసుకున్నాడు షేర్ ఖాన్. వాసిం ఎప్పుడు ఫోన్ చేసినా ప్రత్యేక యాప్ సాయంతో ఆడగొంతుతో మాట్లాడి అనుమానం రాకుండా మేనేజ్ చేసేవాడు. ఇలా డబ్బులు అడుగుతుండడంతో విసిగిపోయిన వాసిం... షేర్ ఖాన్ కు ఫోన్ చేసి నేరుగా కలవాలని పేర్కొన్నాడు. దీంతో, షేర్ ఖాన్.. వాసింతో చాటింగ్ ఆపేశాడు. ఓ రోజు వాసింకు చెందిన కంప్యూటర్ విడిభాగాల దుకాణంపై కొందరు వ్యక్తులు దాడిచేసి అక్కడి సామాన్లను ధ్వంసం చేశారు. దీనిపై వాసిం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ దాడి షేర్ ఖాన్ పనే అని తేలింది. దీంతో, అతడిని ఫేస్ బుక్ ఆధారంగానే ట్రాప్ చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కళ్ళుతిరిగే వాస్తవాలు వెల్లడించాడు షేర్ ఖాన్. అతడి మోసాలకు 100 మంది దాకా యువకులు బలయ్యారట.

  • Loading...

More Telugu News