: ఆగస్ట్ 15 నుంచి హైదరాబాద్ లో సరికొత్త పోలీసింగ్


త్వరలో సరికొత్త పోలీస్ వ్యవస్థ హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుంది. ఆగస్ట్ 15 నుంచి సరికొత్త పోలీసింగ్ ను హైదరాబాద్ పోలీసులు అందుబాటులోకి తేనున్నారు. సరికొత్త వాహనాలతో పోలీసులు గల్లీగస్తీని నిర్వహిస్తారు. దీనికోసం ఇప్పటికే 300 ఇన్నోవా వాహనాలను కొనుగోలు చేశారు. ఈ వాహనాల బ్రాండింగ్ ఎలా ఉండాలన్న విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. వాహనాలపై వాడాల్సిన రంగుతో పాటు... ఏ నమూనాలను ముద్రించాలనే విషయంపై రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. వాహనాలపై పోలీస్, డయల్ 100 తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల లోగోలను రేడియం స్టిక్కర్ల రూపంలో అతికించాలని నిర్ణయించారు. అదే విధంగా ఇప్పటికే దాదాపు ఖరారైన తెలంగాణ స్టేట్ పోలీస్ లోగోను ఆగస్ట్ పదిహేను నుంచి ఉపయోగిస్తారు. హైదరాబాద్, సైబరాబాద్ జంటకమిషనరేట్లలో గస్తీ నిర్వహించేందుకు ఇన్నోవా కార్లతో పాటు హోండా ఎక్స్ ట్రీమ్ బైకులను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలి విడతగా రానున్న రెండు మూడు రోజుల్లో 500 బైకులను కొనుగోలు చేసి... వాటిని ఆగస్ట్ మొదటి వారంలో హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేయనున్నారు. ఈ బైక్ లకు హై రెజల్యూషన్ కెమెరాలను కూడా అమర్చనున్నారు.

  • Loading...

More Telugu News