: ఆ విమానం నేలను ఢీ కొట్టి... ఎగిరి ముక్కలు చెక్కలైంది!
అల్జీరియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ప్రమాదం బారినపడి కూలిపోయిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో మొన్న సాయంత్రం (భారత కాలమానం ప్రకారం) జరిగిన అల్జీరియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు, లోహవిహంగం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని, అందుకే ముక్కలుచెక్కలై అర కిలోమీటరు పరిధిలో శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మృత్యువాతపడ్డారు. కొన్ని కుటుంబాలకు చెందిన వారంతా దుర్మరణం పాలయ్యారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక కుటుంబంలోని 10 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కాలిపోయి, ఛిద్రమైన మృతుల అవయవాలు మాత్రమే లభ్యంకావడంతో మతదేహాలను గుర్తించడం కుదరడం లేదని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లే పైలట్ విమానాన్ని దారి మళ్లించి ఉండవచ్చని, పేర్కొంటున్న నిపుణులు విమానం అంత బలంగా నేలను ఎందుకు ఢీకొట్టిందో తేలాల్సి ఉందని చెప్పారు. విమాన శకలాల నుంచి రెండో బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందినవారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.