: టీ-జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: అల్లం నారాయణ


తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ నివాస స్థలాలు, అక్రిడేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. శనివారం నాడు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు మహా సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు. వీటి ద్వారా జర్నలిస్టుల కుటుంబాలు రూ.2 లక్షల విలువైన వైద్యాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తోన్న జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ ద్వారా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధికి 10 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు రవికుమార్, రమణ, జిల్లా అధ్యక్షుడు కిరణ్, జెడ్పీటీసీ సభ్యుడు బుచ్చిరెడ్డి, సర్పంచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News