: కోటి ఖర్చుకు 100 కోట్ల ప్రచారం చేసిన సానియా మీర్జా


టెన్నిస్ దిగ్గజాలు ప్రకాశ్ పదుకునే, లియాండర్ పేస్, మహేష్ భూపతి వంటి ఆటగాళ్లకు రాని పేరు ప్రతిష్ఠలు సానియా మీర్జాను వరించాయి. కరణం మల్లీశ్వరి, కోనేరు హంపి, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల వంటి వారు ఉత్తమ ఫలితాలు సాధించినా, టెన్నిస్ లో ఏ మహిళ సానియా స్థాయిలో రాణించకపోవడానికి తోడు, మీడియా సహకరించిన తీరు కూడా ఆమెను సూపర్ స్టార్ ను చేసేశాయి. దీంతో తన యూఎస్ ఓపెన్ సన్నాహకాలకు సాయం చేయమని అడగగానే కోటి రూపాయలు ప్రకటించి తెలంగాణ రాష్ట్రం తన పెద్దమనసును చాటుకుంది. పారితోషికం వివరాలు, చర్చలు లేకుండానే పనిలో పనిగా సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రకటించేసింది. దీంతో పెను దుమారం రేగింది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఫీజు రీయింబర్స్ మెంట్ కు డబ్బులు లేవనే తెలంగాణ సర్కారు నిండా డబ్బు, పేరు ప్రతిష్ఠలు ఉన్న క్రీడాకారిణికి కోటి రూపాయలు వితరణగా ఇవ్వడం అవసరమా? అంటూ బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. సోషల్ మీడియా మొత్తం సానియాకు కోటి కేటాయించడంపై దుమ్మెత్తి పోసింది. మెట్టినిల్లే మహిళకు శాశ్వత స్థానం అంటూ ఆమె పాకిస్థాన్ కు చెందినదే అని నిర్థారించింది. ఇంతలో వివాదం జాతీయ స్థాయికి చేరింది. విమర్శలు, సమర్థింపులతో రామాయణంలో పిడకల వేటలా తయారైంది. ఇంతలో తాను తెలంగాణ వ్యక్తినని, తన చివరి క్షణాల వరకు భారతీయురాలిగానే ఉంటానని, తన భర్త దేశీయతను తానెన్నడూ చూడలేదని సానియా మీర్జా కంటతడి పెట్టింది. ఆమెకు ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ కూడా విశేషమైన సహాయసహకారాలు అందించింది. దీంతో తెలంగాణ నేతలు సంబరపడిపోతున్నారు. బ్రాండ్ అంబాసిడర్ అనే పేరుకు తగ్గట్టు సానియా మీర్జా తెలంగాణ రాష్ట్రానికి వంద కోట్ల ప్రచారం చేసిందని కొంత మంది నేతలు పేర్కొంటున్నారు. ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బ్రాండ్ అంబాసిడర్ వేటలో పడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News