: రోడ్డుపై 'బీరు' లోడు తిరగబడింది... పండగ చేసుకున్న స్థానికులు
రోడ్డుపై ఏదన్నా వాహనం బోల్తా కొట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో సరుకు లూటీ కావడం తెలిసిందే. తాజాగా, రాజస్థాన్ లో బీరు కేసులు రవాణా చేస్తున్న ఓ లారీకి యాక్సిడెంట్ అవడం స్థానికులకు వరంలా మారింది. జైపూర్-అజ్మీర్ బైపాస్ రహదారిపై జైపూర్ కు సమీపంలో బీరు లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది. దాంట్లో ఉన్న బీరు కార్టన్లు రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపై బీరు లారీ తిరగబడిందన్న వార్త స్థానికుల్లో దావానలంలా వ్యాపించింది. ఎక్కడెక్కడినుంచో తండోపతండాలుగా వచ్చిన ప్రజలు సంఘటనస్థలి నుంచి పగిలిపోకుండా ఉన్న బీరు సీసాలు ఎత్తుకెళ్ళారు. మోయగలిగినన్ని సీసాలు తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి మరికొన్ని చేతబట్టుకుని వెళ్ళారు. కొద్ది వ్యవధిలోనే అక్కడ పగిలిన సీసాలు తప్ప మరేమీ మిగలలేదట.