: టీమిండియా కోసం గంగూలీ పంచ సూత్ర ప్రణాళిక
ఇంగ్లండ్ తో సిరీస్ సందర్భంగా భారత మాజీలు టీమిండియాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా సీనియర్ల సలహాలను సావధానంగా వింటున్నాడు. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ లో రేపటి నుంచి మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ సారథి సౌరవ్ గంగూలీ భారత జట్టు విజయానికి పంచ సూత్ర ప్రణాళిక తయారుచేశాడు. ఆ సూత్రాలు ఏమిటో దాదా మాటల్లోనే... * భారత ఆటగాళ్ళను గెలుపు కోసం ఆవురావురుమనేలా తయారుచేయాలి. లార్డ్స్ విజయం మత్తు నుంచి వారిని బయటపడేయాలి. గతంలో విదేశాల్లో పర్యటించినప్పుడు మనవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోనే దెబ్బతిన్నారు. ఆ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ధోనీ, కోచ్ ఫ్లెచర్ ల ప్రధాన బాధ్యత ఇదే. * పిచ్ ఎంతో ప్రాధాన్య అంశం. బౌలర్లకు అనుకూలించే పిచ్ లపై టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ప్రపంచవ్యాప్తంగా మన విజయాలన్నీ ఓసారి పరిశీలిస్తే బౌలర్ల చలవతోనే ఎక్కువ సక్సెస్ అయ్యామన్న విషయం బోధపడుతుంది. పెర్త్, డర్బన్, హెడింగ్లే, నాటింగ్ హామ్ మైదానాల్లో పిచ్ లపై పచ్చిక ఎక్కువ. తద్వారా మన బౌలర్లు ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేయగలిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌతాంప్టన్ టెస్టు సహా మిగతా రెండు టెస్టులకు పచ్చికతో కూడిన పిచ్ లు తయారుచేయడం మినహా ఇంగ్లండ్ కు మరో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే వారికి ప్రధాన స్పిన్నర్ లేడు. పేస్ తప్ప మరో మార్గంలేదు. అందుకే టాస్ సమయంలో ధోనీ సరైన నిర్ణయం తీసుకోవాలి. రెండో టెస్టు ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు చేస్తాడని భావించను. * బ్యాటింగ్ ఆర్డర్ విషయానికొస్తే ధోనీ ఫ్లాట్ పిచ్ లపై ఆరోస్థానంలో దిగడం బాగానే ఉంటుంది. ఫాస్ట్ పిచ్ లపై అదే ఆర్డర్లో రావడం సరికాదు. ఒకవేళ జట్టులోకి రోహిత్ ను తీసుకుంటే ధోనీ కొంచెం దిగువగా అంటే ఏడో స్థానంలో దిగాలి. తద్వారా బ్యాటింగ్ లోతు పెరుగుతుంది. ప్రత్యర్థి జట్టు విషయానికొస్తే, సీనియర్ ఆటగాడు ఇయాన్ బెల్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. కెప్టెన్ కుక్ తో సహా కొత్త ముఖాలు శామ్ రాబ్సన్, గ్యారీ బాలెన్స్ వంటి ఆటగాళ్ళు ఇప్పటికిప్పుడు మ్యాచ్ ను లాగేసుకునేంత ప్రభావం చూపడంలేదు. ఒక్క సెషన్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగల కెవిన్ పీటర్సన్, ఫ్లింటాఫ్ వంటి ప్రమాదకారులు ప్రస్తుత ఇంగ్లిష్ జట్టులో లేరు. ఇంగ్లండ్ జట్టు లోపాల దృష్ట్యా మ్యాచ్ ధోనీ నియంత్రణలోనే ఉండబోతోంది. అందుకు ధోనీ అండ్ కో చెయ్యాల్సిందల్లా... తొలి ఇన్నింగ్స్ లో 450 పైచిలుకు స్కోరు సాధించాలి. అప్పుడు మ్యాచ్ లో విజయం సాధ్యమవుతుంది. * మరో ముఖ్యమైన విషయం యువ పేసర్ మహ్మద్ షమీని గాడిలో పడేయాలి. ఇషాంత్ శర్మతో పాటు భువనేశ్వర్ కూడా ఈ టూర్లో విశేషంగా రాణిస్తున్నాడు. 'అతను రాణిస్తున్నాడు, నేనూ రాణిస్తాను' అన్న దృక్పథం ఆటగాళ్ళలో రగిలితే అది జట్టుకు మేలు చేస్తుంది. ధోనీ ఈ అంశంపై ఆలోచించాలి. * అన్నింటికన్నా ముఖ్యమైన విషయం... టాస్ గెలిచిన అనంతరం తీసుకునే నిర్ణయం చాలా కీలకం. లార్డ్స్ టెస్టును ఓ పాఠంలా స్వీకరించాలి. ఆ మ్యాచ్ లో తొలుత టీమిండియానే బ్యాటింగ్ చేసింది. తద్వారా నాలుగో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పై ఒత్తిడి పెరిగిపోయింది. బౌలర్లకు అనుకూలించే పిచ్ కదా అని... ఆ మ్యాచ్ లో ధోనీ కూడా టాస్ గెలిచి ఉంటే బౌలింగే ఎంచుకునేవాడు. బౌలింగ్ కు అనుకూలించే పిచ్ అయినా రిస్క్ తీసుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గతంలో జోహానెస్ బర్గ్ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నప్పుడే గెలిచామన్న విషయం ధోనీ గుర్తుచేసుకోవాలి.