: తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రానికి స్థానం?


తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. రాష్ట్ర విభజనకు ముందు టీటీడీ పాలకమండలిలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందినవారు సభ్యులుగా ఉండే వారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇరుప్రాంతాలకు దాదాపు సమప్రాధాన్యం ఉండేది. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సభ్యులను టీటీడీ పాలకమండలిలోకి తీసుకునేవారు. అయితే, ఈ ఏడాది జూన్‌ 2న ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో... టీటీడీ పాలకమండలిలో తెలంగాణ ప్రాతినిధ్యం ఎలా ఉండాలన్న దానిపై ఏపీ సర్కార్ తాజాగా దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా టీటీడీ పాలకమండలి సభ్యులుగా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల వారిని ఎంపిక చేద్దామా... లేక రాష్ట్రం విడిపోయినందున తెలంగాణనూ కర్ణాటక, తమిళనాడు తరహాలో పొరుగు రాష్ట్రంగా భావించి సభ్యుల నియామకం చేపడదామా? అని ఏపీ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. టీటీడీ ఆస్తులు పెద్దఎత్తున తెలంగాణ ప్రాంతంలోనూ ఉన్నందున, అక్కడి ప్రభుత్వం తరపున ఒక ఉన్నతాధికారిని పాలకమండలిలోకి తీసుకుని... మిగతా సభ్యులను తెలంగాణ నుంచి తమకు ఇష్టం వచ్చిన వారిని తీసుకోవాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఇలా చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడంతో పాటు తమ అభీష్టాన్ని కూడా నెరవేర్చుకోవాలన్న యోచనలో ఏపీ సర్కార్ ఉంది. గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమకు ఇష్టమైన వారిని టీటీడీ పాలకమండలిలోకి తీసుకునేవారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్ర విషయంలోనూ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News