: 11 నుంచి 46 ఏళ్ల మధ్యనున్న ఆడాళ్లందరికీ సున్తీ చేయండి!: ఇరాక్ మిలిటెంట్ల ఫత్వా
ఇస్లాం పేరిట ఐఎస్ఐఎల్ మిలిటెంట్లు ఆటవిక చర్యలకు దిగారు. ఇరాక్‌లో 11 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు సున్తీ చేయాలని ఐఎస్ఐఎల్ మిలిటెంట్లు ఫత్వా జారీ చేశారు. దీనిపై ఐక్యరాజ్య సమితీ త్రీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఫత్వా ప్రభావం సుమారు 40 లక్షల మంది ఆడవారిపై పడనుంది. ఇరాక్‌లో తీవ్రవాదులు మోసుల్ పట్టణం సహా అనేక కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఐఎస్ఐఎస్ జిహాదీ తీవ్రవాదులు ఇస్లాంకు తమవైన భాష్యాలు చెబుతూ తాజా ఫత్వా జారీ చేశారు. మహిళలకు సున్తీ చేయడం అనేది ఇరాక్‌లోని మారుమూల ప్రాంతాల్లో జరిగేది తప్ప ఇతర ప్రాంతాల్లో అంతగా లేదని ఇరాక్‌లో ఐక్యరాజ్యసమితి సీనియర్ ఉన్నతాధికారి జాక్వెలిన్ బాడ్‌కాక్ తెలిపారు. ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు జారీచేసిన ఫత్వాపై భారతీయ ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలు ఇస్లాంకు వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. ఐఎస్ఐఎల్ తీవ్రవాదులు జారీ చేసిన ఫత్వా ఆటవికమని, మహిళల హక్కుల్ని కాలరాయడమని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.