: 'ఆర్ అండ్ బీ'కి ఆర్థికమంత్రి యనమల షాక్!


ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు షాకిచ్చారు. ఈ బడ్జెట్ లో ఆ శాఖకు నిధులేమీ కేటాయించలేమని, అత్యంత ప్రాధాన్యం కలిగిన పనులను మాత్రం చేపడితే చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఇప్పటికే రూ.700 కోట్ల మేర పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కూడా చేసుకున్న సదరు శాఖ అధికారులు, ఏం చేయాలో తెలియని అయోమయంలో కూరుకుపోయారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా గురువారం జరిగిన ఆర్ అండ్ బీ శాఖ సమీక్ష సందర్భంగా యనమల, ఈ మేరకు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సమక్షంలోనే ఈ తరహా సూచనలు చేయడం గమనార్హం. అసలు లోటు బడ్జెట్, ఆపై కొత్తగా రాజధాని నిర్మాణం తదితర సమస్యల నేపథ్యంలో పూర్తిగా పొదుపు పాటిస్తేనే మంచిదంటూ యనమల, చావు కబురు చల్లగా చెప్పారు. ఒప్పందాలు చేసుకున్న కాంట్రాక్టర్లు ఒకవేళ కోర్టులను ఆశ్రయిస్తే, పరిస్థితి ఏమిటన్నది అధికారుల ప్రశ్న. తాజాగా యనమల ఆదేశాలతో ఆ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాలు మినహా, ఒక్క పైసా కూడా విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తొమ్మిది నెలలుగా వివిధ పనుల కోసం రోడ్లు, భవనాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,300 కోట్లు కేటాయించింది. వీటిలో ఇప్పటికే రూ.700 కోట్ల మేర పనులకు ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. అంతేకాక వచ్చే ఏడాదికి పనులను వాయిదా వేస్తే, అంచనాలు రెట్టింపయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో చిల్లిగవ్వ కూడా విదల్చలేమంటూ మంత్రి తేల్చేయడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దీంతో, గ్రామాల నుంచి మండలాలు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారి వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రణాళికలను ఆ శాఖ పక్కనబెట్టేయక తప్పడం లేదు. మరి, కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న బెంగతో ఉన్న అధికారులు, రాబోయే సమస్యలను ఎలా ఎదుర్కోవాలా..? అన్న అంశంపై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News