: నేడు ఇన్వెస్ట్ మెంట్ ట్రాకింగ్ సిస్టం పోర్టల్ ప్రారంభం
రాష్ట్ర విభజన కారణంగా మౌలిక వసతుల విషయంలో తీవ్రంగా ప్రభావితం కానున్న ఆంధ్రప్రదేశ్ కు ఊతమిచ్చే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం స్థాయిలో కదలిక మొదలైంది. ఇందులో భాగంగా తొలుత పెట్టుబడులను గుర్తించే ప్రత్యేక వ్యవస్థ (ఇన్వెస్ట్ మెంట్ ట్రాకింగ్ సిస్టం) కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను ప్రారంభించనుంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని పెట్టుబడులకు సంబంధించిన కేంద్ర మంత్రివర్గ కమిటీ పరిధి కింద పనిచేసే ఈ వ్యవస్థ, పెట్టుబడుల ప్రవాహంపై ముందుగా దృష్టి సారించనుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూలతలను గమనించడం, వాటిని పారిశ్రామిక వర్గాలకు చేరవేయడంతో పాటు ఆయా పారిశ్రామిక సంస్థలతో నిత్యం సంప్రదింపులు నిర్వహించడం తదితర కీలక అంశాలపై ఈ వ్యవస్థ పనిచేయనున్నట్లు సమాచారం. అంతేకాక దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులపైనా ఈ వ్యవస్థ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఈ వ్యవస్థ కొంతకాలం పాటు క్రియాశీలకంగా పనిచేస్తే, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పెట్టుబడులు రావడం ఖాయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.