: నువ్వెంతంటే నువ్వెంత అంటూ చొక్కాలు పట్టుకున్నారు...తోసుకున్నారు!: బీహార్ శాసనసభలో ఎమ్మెల్యేల బాహాబాహీ
బీహార్ విధాన సభలో ఎమ్మెల్యేలు గుండాలుగా మారిపోయారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు... వెల్ లోకి వెళ్లి చొక్కాలు పట్టుకున్నారు... ఒకర్నొకరు తోసుకున్నారు. ప్రజాస్వామ్యంలో బీహార్ శైలి వేరని అక్కడి ఎమ్మెల్యేలు నిరూపించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. బీహార్ విధాన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ మహిళలకు భద్రతపై సమగ్రమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి మంత్రి విజయ్ చౌదరి సమాధానం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని మోడీ వెల్ లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అయనకు బీజేపీ నేతలు సహకరించారు. దీంతో జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ బీజేపీ నేత మోడీని విమర్శించారు. దీంతో బీజేపీ నేత మంగల్ పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే... బీజేపీ, జేడీయూ నేతలు వెల్ లోకి దూసుకెళ్లి ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. చొక్కాలు పట్టుకున్నారు. తోసుకున్నారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఇరు పార్టీల అగ్రనేతలు నితీష్ కుమార్, సుశీల్ కుమార్ మోడీలు సభలోనే ఉండడం విశేషం!