: కేంద్రంలో మోడీ తరువాతి స్థానం ఎవరిది?


ఎన్డీఏ ప్రభుత్వంలో వైస్ కెప్టెన్ ఎవరో అర్థం గాక ఢిల్లీలోని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ తర్వాతి స్థానం ఎవరిదన్న విషయంపై సర్వత్రా చర్చ మొదలైంది! సెకెండ్ ప్లేస్ రేసులో అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లు మిగతా సీనియర్ నాయకుల కన్నా ముందున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు అవడం అరుణ్ జైట్లీకి సానుకూలాంశం కాగా, నిన్నమొన్నటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీజేపీని సమర్థవంతంగా నడిపించిన ఘనత రాజ్ నాథ్ కు కలిసివచ్చే అంశం. అయితే వీరిద్దరిలో నెంబర్ 2 ఎవరనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పటివరకు తేల్చిచెప్పలేదు. సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ వ్యవహారాలను చూసేందుకు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక చేసిన వారినే నెంబర్ 2 గా పరిగణిస్తారు. అయితే ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు నెం.2 ఎవరనే ఉత్తర్వులు మోడీ జారీ చేయలేదు. దీంతో జైట్లీ, రాజ్ నాథ్ లలో ఎవరు నెంబర్ 2 అనే సస్పెన్స్ కొనసాగుతోంది. సాధారణంగా పార్లమెంట్ లో ప్రధానమంత్రి తర్వాత సీటును నెంబర్ 2 కు కేటాయిస్తారు. ఈ సీటును హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కేటాయించనున్నట్టు పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రాజ్ నాథ్ సింగ్ ను నెంబర్ 2 అని చెప్పకనే చెప్పినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి పదవిని అలంకరించే ముందు వరకు ప్రణబ్ ముఖర్జీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో నెంబర్ 2 గా వ్యవహరించేవారు. కీలక విషయాలలో ప్రణబ్ ను సంప్రదించకుండా మన్మోహన్ ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు. ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన ప్రణబ్ కు అప్పటి ప్రభుత్వ వర్గాలు మన్మోహన్ తో దాదాపు సమానంగా ప్రాధాన్యత ఇచ్చేవి.

  • Loading...

More Telugu News