: అమెరికా సమాచార చౌర్యానికి జర్మనీ విరుగుడు
అమెరికా గూఢచర్యం బారిన పడని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. అధికార కాంక్షతో వర్ధమాన దేశాలపై పెద్దన్న పాత్ర పోషించే అమెరికా వివిధ దేశాల అంతర్గత సమాచారాన్ని చోరీ చేయడంలో సిద్ధహస్తురాలని స్నోడెర్న్ తెలపడంతో ప్రపంచం ఉలిక్కి పడింది. అమెరికా గూఢచర్యం బారిన పడకుండా తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుందా? అని ప్రపంచదేశాలు తలపట్టుకుని కూర్చున్నాయి. కంప్యూటర్లు, లాప్ టాప్ లు, టాబ్ ల యుగంలో అమెరికాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాని పని అని వివిధ దేశాలు నిర్ధారణకు వచ్చాయి. కానీ జర్మనీ మాత్రం అందుబాటులో ఉన్న అన్ని వనరులని పరిశీలించింది. చివరకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ టైప్ రైటర్లే అమెరికా గూఢచర్యానికి అడ్డుకట్టవేయగలవని నిర్థారణకు వచ్చింది. దీంతో జర్మనీలో ఒక్కసారిగా టైప్ రైటర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఎందుకంటే, అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఎన్ ఎస్ ఏ ఏకంగా జర్మనీ చాన్స్ లర్ ఎంజెలా మెర్కెల్ ఫోన్ ను ట్యాప్ చేసింది. చాలా మంది రాజకీయనాయకుల ఫోన్లను, ఈ మెయిల్ ఎకౌంట్లను, వెబ్ సైట్లను కూడా అమెరికా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి సమాచారం దొంగిలించడం సాధారణమని గుర్తించిన జర్మన్లు, టైప్ రైటర్ల యుగానికి వెళ్లిపోవాలని నిర్ణయించారు. దీంతో ఒలింపియా, బాందెర్మాన్ కంపెనీల టైప్ రైటర్లకు ఇప్పుడు భారీగా గిరాకీ పెరిగింది. తమకు 10000 కి పైగా ఆర్డర్లున్నాయని ఆ కంపెనీలు సంబరంగా చెబుతున్నాయి. టైప్ రైటర్ ను బగ్ చేయడం, ట్యాప్ చేయడం అసాధ్యం కాబట్టి దీన్నే వాడమని జర్మన్ రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు.