: కూల్చడానికి సిబ్బంది ఉన్నారా?... కౌన్సిలింగ్ నిర్వహించేందుకు లేరా?: రావెల
యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు కూల్చడానికి తెలంగాణ ప్రభుత్వం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారు. కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సిబ్బంది లేరా? అని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. స్థానికత సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని రేపు ఢిల్లీకి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, మానవ వనరుల శాఖమంత్రి స్మృతి ఇరానీని కలిసి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తెలియజేయనున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.