: సింగపూర్ కంటే మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం: కేసీఆర్
హైదరాబాదుకు వచ్చే పారిశ్రామికవేత్తలను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీఎం ఆఫీసుకు తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ రోజు ఆయన హైదరాబాదులోని హోటల్ గ్రాండ్ కాకతీయలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగపూర్ కంటే మెరుగైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం తెలంగాణలో సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నింటినీ ఇస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాదుకు రావాలని... తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేసీఆర్ కోరారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి అందరూ తోడ్పడాలని విన్నవించారు. ఒకటి రెండు అనుమతులు మినహా మిగిలిన వాటినన్నింటినీ ఒక్క చోటే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి అంశాన్నీ తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైనంత భూమి తెలంగాణలో అందుబాటులో ఉందని తెలిపారు. అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణను నిర్మిస్తామని చెప్పారు. సింగరేణిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.