: హైదరాబాదులో ఇక ఏసీ బస్ షెల్టర్లు!


హైదరాబాద్ నగరంలోని ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని రవాణా వ్యవస్థలో అధునాతన వసతులను అందించేందుకు తెలంగాణ రాష్ట్రం సన్నాహాలు చేస్తోంది. ఐటీ సంస్థల ఉద్యోగులు విధులు ముగించుకుని, వేళ కాని వేళ ఇళ్లకు వెళుతున్న క్రమంలో పలు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్న దరిమిలా, వాటికి చెక్ పెట్టేస్తూ, ఐటీ ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. ఐటీ సంస్థల షిఫ్టులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు సర్వీసులను నడుపుతుండటంతో ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగానే ఉందట. దీంతో మరిన్ని అధునాతన సౌకర్యాలతో ఐటీ ఉద్యోగులను ఆకర్షించేందుకు తెలంగాణ సర్కారు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఏసీ బస్సు షెల్టర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఐటీ సంస్థలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 10 ఏసీ బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న అధికారులు తొలివిడతగా నానక్ రాం గూడ జోన్ (ఐబీఎస్ ఎదుట), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతం (ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట) వద్ద ఏసీ బస్సు షెల్టర్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. 24 గంటలపాటు ఏసీతో పాటు ఏటీఎం కూడా అందుబాటులో ఉండే విధంగా రూపుదిద్దుకోనున్న ఈ బస్సు షెల్టర్లలో నిత్య పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేయనున్నారు. సౌకర్యవంతంగా ఉండే సీట్లు, బస్సు వేళలను తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు కానున్నాయి. నెలరోజుల్లోగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఐటీ ఉద్యోగులకు అందుబాటులోకి తేవాలని అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. నిర్మాణ పనులు పూర్తి కాగానే, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News