: త్వరలో తెలంగాణ రాష్ట్ర సలహా మండలి!
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సూచనలు, సలహాలిచ్చేందుకు కొత్తగా రాష్ట్ర సలహా మండలి కొలువుదీరనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపేందుకు సలహా మండలిని ఏర్పాటు చేయనున్నట్లు గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న వారంలోగా ఈ సలహా మండలి ఏర్పాటవుతుందని ప్రభుత్వంలోని కీలక వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని రంగాలకు చెందిన నిపుణులు ఉండే ఈ కమిటీ, ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లేందుకు అవలంబించాల్సిన విధానాలపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. సలహా మండలి ఏర్పాటుపై ఇప్పటికే దృష్టి సారించిన కేసీఆర్, 40 మంది పేర్లతో కూడిన జాబితాను వడపోస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలిలో సభ్యుల సంఖ్యను 20కే పరిమితం చేయనున్నారన్న అధికార వర్గాల సమాచారంతో ఆయా రంగాలకు చెందిన నిపుణులు తుది జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యక్షుడి పదవి కోదండరాంకేనా..? ఇదిలా ఉంటే, వివిధ రంగాలకు చెందిన 20 మంది సభ్యులుండే ఈ మండలికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇక మిగిలిన సభ్యుల్లోని ఓ నిపుణుడిని కమిటీకి ఉపాధ్యక్షుడిగా నియమించనున్నారు. ఈ కమిటీలో కీలక భూమిక ఉపాధ్యక్షుడిదేనన్న ప్రచారంతో, ఈ పదవి ఎవరికి దక్కనుందన్న అంశంపైనా సర్వత్ర చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి అలుపెరగని పోరు సాగించిన ప్రొఫెసర్ కోదండరాం కూడా కమిటీలో ఓ సభ్యుడిగా ఉంటారని ఇప్పటికే తేలిపోయింది. ఉద్యమం జరిగినంత కాలం ఉద్యోగాన్ని పక్కనబెట్టిన కోదండరాం, ఇటీవలే తిరిగి ఉద్యోగంలో చేరారు. రాజకీయ పదవులేవీ చేపట్టేందుకు ఆయన అంతగా ఆసక్తి చూపలేదు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత కోదండరాం సేవలను వినియోగించుకుంటామని గతంలో కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో సలహా మండలికి కోదండరాంనే ఉపాధ్యక్షుడిగా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. ఈ పదవి రేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీహెచ్ హన్మంతరావు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.