: పాపం కాంగ్రెస్... ఆ రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులు
కాంగ్రెస్ పార్టీకి కాలం కలసిరావడం లేదు. గోరుచుట్టు మీద రోకలి పోటులా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం రాష్ట్రపతిని వేడుకోవలసిన దుస్థితి. పలు కుంభకోణాల్లో కాంగ్రెస్ నేతలు ఎదుర్కొంటున్న విచారణ. అధికారపక్షం తమను లెక్కచేయని పరిస్థితి. వీటన్నింటికీ తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా చుట్టుముడుతున్న పలు ఆరోపణలు. ఎన్సీపీ లాంటి మిత్రపక్షాలు నెమ్మదిగా దూరమవుతున్న పరిస్థితి. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, అసోంలో అసమ్మతి సమస్య తీవ్ర శిరోభారంగా మారింది. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ని గద్దెదింపాలని డిమాండ్ చేస్తూ అతని వ్యతిరేక వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిశారు. అసమ్మతివాదులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఇంతలో మహారాష్ట్రలో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అతనిని మార్చకుంటే కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అతనిని శాంతింపజేయాలని మరాఠా సీనియర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంటి పోరుతో సతమతమవుతోంది.